నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈవో దేవ సహాయం, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌లతో కలిసి అదనపు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 102 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను సవివరంగా పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా సమీక్షించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.