యైటింక్లయిన్ కాలని, ముద్ర: సింగరేణిలో పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ.. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు గురువారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి వినతి పత్రం అందించారు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ ఆలీ, సహాయ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, ఎర్రగాని కృష్ణయ్య, ఉపాద్యాక్షులు క్రిస్టోఫర్, నాయకులు జెట్టి మల్లయ్య, ఖాతా రాజు ప్రభాకర్ లు ఉదయం హైదరాబాదులో మంత్రి జి. వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి లోనీ అన్ని విభాగాల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేలకు తగ్గకుండా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ ఈఎస్ఐ వైద్య సౌకర్యం అమలు చేపిస్తూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. అలాగే స్థానిక నిరుద్యోగులకు, భూ నిర్వాసితులకు సింగరేణి, ఇతర ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇంకా తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక తమ విన్నపంపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.