ముద్ర, నారాయణపేట:
నారాయణపేట జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పళ్ళ పోల్కమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూజలను చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ధర్మ రక్షకుడు అయిన శివాజీ మహారాజ్ విగ్రహం మన నారాయణపేటలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. ఈ మహోన్నత కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విగ్రహ ఏర్పాటు కోసం సహకరించాలని కోరారు. విరాళాల సేకరణ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా జి. కురుమన్న, జి శేషు యాదవ్, శ్రీపాద్ కులకర్ణి లు ఒక్కొక్కరు 1లక్ష చొప్పున విరాళం అందించారు. అలాగే సంకలపురం మల్లేష్ రూ. 51 వేలు అందించగా భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల చెక్ అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మహేష్, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, రఘురామయ్య గౌడ్, కన్న శివకుమార్, పళ్ళ రఘు, పావడి మహదేవ్, హోటల్ నవీన్, మణిశంకర్, జుట్టు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.