ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జన గణన 2027 పథకాల అమలు, దేశ అభివృద్ధికి మూలమని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు (ఛార్జీ అధికారులు) 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జన గణన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శిక్షణ కార్యక్రమం లో పూర్తి అవగాహన కలిగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జన గణన 2027 సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్, హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన నిర్వహించబడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని, రెండవ దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుందని, మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని అన్నారు. ఈ సంవత్సరం జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అంటే ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో నిర్వహించబడే ఇళ్ల జాబితా గృహాల గణనలో ఇంటి నిర్మాణం (కచ్చా పక్కా,తదితర,) ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి, గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారుల బాధ్యతలను వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని డైరెక్ట్రేట్ ఆఫ్ ప్లానింగ్ శాఖ జనాభా లెక్కల అధికారులుశ్రీకాంత్ నాయక్, వంగ పండు గీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జన గణన, హౌస్ లిస్టింగ్,ఎన్యూమరేషన్ చేయడం శిక్షణ లో అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డి ఆర్ ఓ మంగీలాల్, తాండూర్ డి ఆర్ ఓ అనిత, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, అన్ని మండలాల తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.