Take a fresh look at your lifestyle.

ప్రజావాణికి 119 పిర్యాదులు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ప్రజావాణిలో 119 దరఖాస్తులు స్వీకరణ
ప్రజావాణికి ప్రజలు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కొరకు వస్తారని, వారి ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.


కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 119 పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారిగా మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, అటవీ శాఖ, డీఆర్‌డీఏ, ప్రణాళిక శాఖ, భూ సేకరణ విభాగాలకు చెందిన అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై వివరణ ఇవ్వాలని కోరారు. వారంలోపు అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి, గత వారం అందిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, ఇంకా పెండింగ్‌లో ఉన్నవి వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను స్పష్టమైన నమూనాలో సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో రోజువారీ షెడ్యూల్ ప్రకారం ప్రజలు, ప్రజా ప్రతినిధులునిర్వహించిన కార్యక్రమాలను తప్పని సరిగా ఫోటోలు పంపించాలని సూచించారు. ప్రతి రోజూ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి జడ్.పి సి ఇ ఓ సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర,ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.