Take a fresh look at your lifestyle.

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..-మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..?
ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..?
భార్యాభర్తల మాటలు విన్నందుకా..
పోలీసులు మంచోళ్లు కాబట్టే..
ముసుగులేసి తీసుకెళ్లలేదు
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా
తమ పాలన చూసి ఓటేయాలి
మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ జాతిపిత అంశంపై కేసీఆర్ కుటుంబం చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను జాతిపితగా పిలుచుకుంటామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లి గా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. అసలు ఏ ప్రాతిపదికన మిమ్మల్ని మీరు జాతిపితగా పిలుచుకుంటున్నారు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడి, భార్యాభర్తల మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణలను కూడా విన్న మీకు జాతిపిత అని పిలిపించుకునే నైతిక హక్కు లేదని, ఈ పనులకు మీరు సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వేదికగా బుధవారం జరిగిన విజయభేరి బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , ఆయన కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయానికి బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గు లేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే అది తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లుగా చిత్రీకరించడాన్ని రేవంత్ తప్పుబట్టారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణకు ఇచ్చినట్లా..అలా అయితే ఎర్రవెల్లి, జన్వాడ, మొయినాబాద్‌లలో ఉన్న మీ ఫామ్‌హౌస్‌లు, మీ టీవీ ఛానళ్లు, పేపర్లను ముందుగా ప్రజలకు అప్పగించండి అంటూ సవాల్ విసిరారు.

ముసుగులేసి తీసుకుపోలేదు
రాజకీయాల్లో ఎవరూ చట్టానికి అతీతులు కారని, కేటీఆర్ , హరీష్ రావులపై జరుగుతున్న విచారణల గురించి రేవంత్ ప్రస్తావించారు. పోలీసులు ఎవరినైనా విచారణకు పిలిచినప్పుడు సామాన్యులకు ఎలాంటి కఠిన నిబంధనలు వర్తిస్తాయో, వీరికి కూడా అవే వర్తించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే నిందితుల ముఖాలకు ముసుగులు వేసి తీసుకువెళ్లే ప్రోటోకాల్‌ను కూడా అమలు చేయాలని కానీ పోలీసులు మంచోళ్లన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఎవరూ కూడా తాము ప్రత్యేకం అని భావించకూడదని హితవు పలికారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, గత పాలకులు పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ పతనమైందని, ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడటం నేర్చుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మా పాలన చూసి తీర్పు ఇవ్వండి
మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపు న‌కు విజ‌య‌సూచిక గా వేలాది మంది త‌ర‌లివ‌చ్చారని, స‌భ‌లో ఆడ‌బిడ్డలు ఉత్సాహంగా పాల్గొన‌డం చూస్తే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎదురులేద‌న్న విశ్వాసం క‌నిపిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. తమ ప్ర‌భుత్వం గిరిజునులు, పేద‌లు, ఆదివాసీలు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు , మైనార్టీల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు తీసుకువ‌చ్చిందని, మా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను చూసి మున్సిపల్ ఎన్నిక‌ల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత గ‌త ప్ర‌భుత్వం క‌నీసం రేష‌న్ కార్డులు ఇవ్వ‌లేదని, ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ల‌క్ష‌లాది మందికి రేష‌న్ కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల ప‌ది ల‌క్ష‌ల మందికి స‌న్న బియ్యం ఇస్తున్నామని, గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం బ‌ర్రెల‌కు ధానా పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయే తప్ప బుక్కెడు బువ్వ తిన‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌లేదన్నారు. తమ ప్ర‌భుత్వం ఇస్తున్న స‌న్న బియ్యం పేద‌వారికి చేరుతున్నాయని, స‌న్న బియ్యంతో వండుకుని తింటున్న వారంద‌రూ కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. ప్ర‌తి ఇంటికి రెండు వంద‌ల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఇళ్ల‌లో వెలుగులే కాదు ప్రజల క‌ళ్ల‌లో సంతోషం చూస్తున్నామన్నారు. వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ తో పాటు ఇళ్ల‌కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం చెప్పారు.

రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ మిర్యాల‌గూడ
మిర్యాల‌గూడా లో అత్య‌ధికంగా వ‌రి పండుస్తున్నారని, గ‌తంలో ఆనాటి సీఎం వ‌రి వేసుకుంటే ఉరే అన్నాడని, తమ ప్ర‌భుత్వం వ‌చ్చాక స‌న్న వ‌డ్లు పండిస్తే రూ. 500 బోన‌స్ ఇస్తున్నామని సీఎం చెప్పారు. బోన‌స్ తీసుకుంటున్న అత్య‌ధిక ల‌బ్దిదారులు మిర్యాల‌గూడాలోనే ఉన్నారన్నారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా
రాష్ట్రంలో రైతు భ‌రోసా కింద ప్ర‌తి ఎక‌రాకు రూ. 6 వేలు ఇస్తున్నామని, 9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతుల‌ ఖాతాలకు జమ చేశామన్నారు. ఈసారి మున్సిప‌ల ఎన్నిక‌లు ముగియ‌గానే రైతు భ‌రోసా ఇస్తామని సీఎం ప్రకటించారు. రైతుల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు తమ ప్ర‌భుత్వం ల‌క్షా ప‌దివేల కోట్లు ఖ‌ర్చు చేసిందన్నారు.
రాష్ట్రంలో ఆడ‌బిడ్డ‌ల‌కు ఆర్టీసీలో ఉచిత‌ ప్ర‌యాణం క‌ల్పించామని, కోట్లాది మంది ఆడ బిడ్డ‌లు అమ్మ‌గారి ఇంటికైనా, అమ్మ‌వారి గుడి కైనా ఉచితంగా వెళ్లున్నారన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం చేసిన మ‌హిళ‌లు కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ, బీఆర్ఎస్ కు వాళ్ల‌కు డిపాజిట్లు రావన్నారు. బీఆర్ఎస్, బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న మ‌హిళా అభ్య‌ర్థుల‌కు కూడా ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్నామని సీఎం అన్నారు. బీఆర్ఎస్ నాయ‌కుల‌కు అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తున్నామని, తాము ఎక్క‌డా వివ‌క్ష చూపించ‌లేదని, బీఆర్ఎస్ నాయ‌కుల పిల్ల‌లు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ లో చ‌దువుకోవ‌చ్చన్నారు. రాష్ట్రంలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వైఎస్ ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు 25 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టించామని, డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టిస్తామ‌ని కేసీఆర్ ఆనాడు ఊరించాడని, ప‌దేళ్లు సీఎంగా ఉండి ఫామ్ హౌస్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ క‌ట్టుకున్నాడని విమర్శించారు. ఏ పేద‌వాడికి ఇళ్లు క‌ట్టి ఇవ్వాల‌న్న‌ ఆలోచ‌న బీఆర్ఎస్ చేయ‌లేదని, ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేశామని సీఎం చెప్పారు. ద‌ళారులు, ద‌గా లేకుండా నేరుగా ల‌బ్దిదారుల ఖాతాల్లోనే డ‌బ్బులు వేస్తున్నామని, ప్ర‌తి ఎమ్మెల్యే మ‌రిన్ని ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాల‌ని కోరుతున్నారని, వ‌చ్చే బ‌డ్జెట్ లో కొత్త‌గా ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయ‌బోతున్నామని సీఎం ప్రకటించారు.

మేం కట్టిన ప్రాజెక్టులే
న‌ల్గొండ జిల్లా ప్లోరైడ్ ప్రాంతం అని, ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం గ‌తంలో దొర‌క‌లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న‌ల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల‌న్ని కాంగ్రెస్ పార్టీ క‌ట్టిన‌వే అని, ఎస్ ఎల్ బీసీ 30 కిలో మీట‌ర్ల ట‌న్నెల్ ను గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిందని, న‌ల్గొండ జిల్లా పైన కోపం, విషంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేయ‌లేదని ఆరోపించారు. ఎస్ ఎల్ బీసీ ని రెండేళ్ల‌లో పూర్తి చేయ‌డానికి ముందుకు వ‌చ్చామని, కానీ, అనుకోని ప్ర‌మాదం జ‌రిగి 8 మంది చ‌నిపోయారని, ఎస్ ఎల్ బీసీలో 8 మంది చ‌నిపోతే మామ‌, అల్లుడు, బామ్మ‌ర్థి సంతోష ప‌డ్డారని అన్నారు. క‌డుపులో విషం పెట్టుకున్న‌వాళ్లు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓటు వేయ‌మ‌ని ఎలా అడుగుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిగ్గులేకుండా గంగిరెద్దుల్లా ఇంటి ముందుకు వ‌స్తే క‌ర్రు కాల్చి వాత పెట్టాలని, గంజికి గ‌తి లేని వాళ్లు బెంజ్ కార్లు కొన్నారని, అదంతా మందిని ముంచిన‌దే అని, న‌ల్గొండ జిల్లా ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు అండ‌గా నిల‌బ‌డాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.