Take a fresh look at your lifestyle.

హోరు ముగిసింది.. పోరు మిగిలింది

– మున్సిపాలిటీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు…. రేపే పోలింగ్
– సోమవారం సాయంత్రానికే మూగబోయిన మైకులు
– వారం రోజుల ప్రచారం లో అభ్యర్థుల గెలుపు కోసం అన్నీ పార్టీ ల నేతల ప్రయత్నం
– ఇక ఇంటింటి ప్రచారం పై దృష్టి పెట్టనున్న అభ్యర్థులు
– పోలింగ్ నిర్వహణ ఏర్పాట్ల పై ఎన్నికల అధికారుల కసరత్తు
– ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తులో నిమగ్నమైన పోలీస్ శాఖ
……………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….

మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు సోమవారం సాయంత్రానికి ముగిసింది. మైకుల హోరు,ఒకరి పై ఒకరు చేసుకున్న దూషణలకు ఒక్కసారిగా పులిస్టాప్ పడింది.ఎన్నికల ప్రచారం పట్టణాల్లో రణరంగాన్ని తలపించాయి. కాలనీల్లో మైక్ ల శబ్దానికి ఇళ్లల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండలేక పోయారు. విద్యార్థుల చదువుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నిమిషం కూడా హోరు శబ్దం ఆగకుండా రావడం తో ప్రజలు ఉక్కిబిక్కిరయ్యారు. వారం పాటు ఎన్నో ఇబ్బందులు పడిన ప్రజలకు సోమవారం సాయంత్రం తో ఉపశమనం దక్కింది.ఉమ్మడి జిల్లా లో మహబూబ్ నగర్ ఒక్కటే కార్పొరేషన్ గా మారడం తో మేయర్ పదవి దక్కించుకునేందుకు అన్ని పార్టీల నేతలు వారం రోజులుగా పట్టణం లోనే తిష్ట వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు గానే సీఎం రేవంత్ రెడ్డి అడ్వాన్స్ గా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.తరువాత ఎన్నికల ప్రచారం లో ఇంచార్జి మంత్రి దామోదర రాజానర్సింహా ప్రచారం చేసివెళ్లారు. వారం పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, నేతలు మిథున్ రెడ్డి, ఓబేదుల్లా కొత్వాల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాలమూరు లో ప్రచారం చేపట్టారు.బీ ఆర్ ఎస్ తరపున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక్కరే ప్రచారం లో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్, ఎంపీ డీకే అరుణ ప్రచారం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా లో నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీ లలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. మక్తల్, ఆత్మకూర్ మున్సిపాలిటీ లలో మంత్రి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థుల కోసం వారం పాటు అక్కడే ఉండి ప్రచారం లో పాల్గొన్నారు.ఆయా మున్సిపాలిటీ లలో ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యే లు తమ, తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేపట్టారు. పోలింగ్ బుధవారం ఉండడం తో సోమవారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడం తో నేతలు ప్రచారం ముగించుకొని ఇళ్లకు చేరుకున్నారు. అభ్యర్థులు మాత్రం ఓటర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి కి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సమీపలోని భూత్పూర్, దేవరకద్ర
మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రెండు మున్సిపాలిటీ లలో కలిపి 2 లక్షల 19 వేల 989 మంది ఓటర్లు ఉన్నారు. 82 వార్డులు, 320 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు.పోలింగ్ రోజునఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్త లు తీసుకుంటున్నామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి విజయంద్ర బోయి పేర్కొన్నారు.
…………………………………..

Leave A Reply

Your email address will not be published.