Take a fresh look at your lifestyle.

గద్వాల మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది: * పాలమూరు ఎంపీ డీకే అరుణ

* గద్వాల ​మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ.
* ​ప్రభుత్వానికి సోయి లేదు, రైతులకు ముందుచూపు లేదు.
* ​వెంటనే మల్దకల్, గట్టు మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

​ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు‌‌ పాలమూరు ఎంపీ డీకే అరుణ సోమవారం గద్వాల మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డులో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులతో ఆమె నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, వెంటనే అదనపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా మల్దకల్, గట్టు మండలాల్లో కొనుగోలు‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎకరాకు 25 క్వింటాళ్ల పరిమితిని తొలగించి రైతుల వద్ద ఉన్న పూర్తి స్థాయి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
​ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస అవగాహన గానీ, ముందుచూపు గానీ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో సుమారు 2.70 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న పంట పండినట్లు అధికారుల వద్ద ముందస్తు సమాచారం ఉన్నా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేశారని మండిపడ్డారు. మద్దతు ధర (MSP) ₹2,400 ఉన్నప్పటికీ, ప్రభుత్వ కేంద్రాలు సరిగ్గా నడవకపోవడంతో రైతులు బయట తక్కువ ధరకు అమ్ముకొని క్వింటాల్‌కు ₹700 నుండి ₹800 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో సంచులు, హమాలీలు, లారీలు లేవని అధికారులు చెప్పడం హాస్యాస్పదమని, రైతులు 15 రోజుల పాటు పంటకు కాపలా కాయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఎండలు మండిపోతున్నా మార్కెట్ యార్డులో రైతులకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే రెడ్డి, నాయకులు కృష్ణం రాజు, మురళీధర్ రెడ్డి, రజక నరసింహ, రఘు గౌడ్, బెల్లం నరసింహ, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.