Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తనను కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు గాను ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బండి రమేష్ సీఎం రేవంత్ రెడ్డికి పూల బొకే అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
బండి రమేష్‌ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్పొరేషన్ నిర్వహణ మరియు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని కమ్మ సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి, తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ కార్పొరేషన్ ద్వారా సమాజంలోని పేద ప్రజల ఆర్థికాభివృద్ధికి, వారిలో రాజకీయ చైతన్యం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అప్పగించిన పదవికి మరింత గౌరవం పెరిగేలా, వన్నె తెచ్చేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. దీనికోసం అటు పార్టీ కార్యకర్తలను, ఇటు కార్పొరేషన్‌కు చెందిన వివిధ సంఘాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం దిశా నిర్దేశం చేశారు.

ఈ మర్యాదపూర్వక సమావేశంలో కమ్మ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ పరుచూరి మురళి (మరయ్య) తో పాటు పలువురు ముఖ్య నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.