సంగారెడ్డి ముద్ర,ఫిబ్రవరి 23:
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుండి యథావిధిగా పునఃప్రారంభమై, జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాధురి, డిప్యూటీ కలెక్టర్ ఉమా హారతి,జడ్పీ సీఈవో జానకి రెడ్డి,ఆర్డీఓలు రాజేందర్, దేవుజ తదితరులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రజావాణిలో మొత్తం 38 వినతులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా,ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ప్రజావాణిలో విద్య, వైద్య, రెవెన్యూ, మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం , గృహ నిర్మాణ, డీఆర్‌డీఓ, డీటీఓ, నీటిపారుదల, సర్వే & ల్యాండ్ రికార్డ్స్, బీసీ సంక్షేమం , పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.ఈకార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.