ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)
ఆటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా లభించింది. కళాశాల సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డా.హుస్సేన్ తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరం నుండి 2030–31 వరకు ఐదు సంవత్సరాలపాటు స్వయంప్రతిపత్తి హోదా కల్పించినట్లు ప్రిన్సిపల్ వివరించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి కళాశాలకు అధికారిక సమాచారం అందినట్లు తెలిపారు.
ఈ హోదా ద్వారా కళాశాలకు విద్యా ప్రణాళికలు రూపొందించుకోవడం, పాఠ్యాంశాల్లో నూతన మార్పులు చేయడం, నైపుణ్యాధారిత కోర్సులను ప్రవేశపెట్టడం, పరీక్షా విధానాల్లో సంస్కరణలు చేపట్టడం వంటి అనేక విద్యా స్వేచ్ఛలు లభిస్తాయని వివరించారు. స్వయంప్రతిపత్తి హోదా కళాశాల విద్యా ప్రమాణాల మెరుగుదలకు, విద్యార్థుల ఉపాధి అవకాశాల పెంపుకు, పరిశోధనాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన విద్యా విధానం (నీప్ 2020) అమలుకు కూడా ఇది బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపక బృందం, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, విద్యార్థులకు ప్రిన్సిపల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కళాశాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరి సహకారం కొనసాగించాలని ఆయన కోరారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.