రైతుల కోసం సింగూర్ నీరు విడిపించండి హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా రైతులకు సింగూరు ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) కమిషనర్‌ను ఆశ్రయించారు. సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పదేళ్ల పాటు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని, సింగూర్ జలాలను మెదక్ జిల్లాకు అంకితం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మాజీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకున్న చర్యల వల్ల మెదక్ జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, సింగూర్ నీటి వినియోగంతో వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని వివరించారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గణపూర్ ఆయకట్టు పరిధిలో పంటలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉండగా, నీటి కొరత కారణంగా ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆలస్యంగా క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు నష్టపోయారని విమర్శించారు.

పంట చేతికి వచ్చే కీలక సమయంలో కనీసం ఒక తడి నీరు అందిస్తే పంట బతికే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల నష్టాన్ని నివారించేందుకు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘణపురం ఆనకట్టకు అత్యవసరంగా 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని హెచ్ఆర్సీ కమిషనర్‌ను కోరారు.
ఈ నీటి విడుదలతో ఎంఎన్, ఎఫ్‌ఎన్ కాలువల కింద ఉన్న పాపన్నపేట, కొల్చారం, హవేళి ఘణాపూర్, మెదక్ మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రైతుల అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల్లోపు నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు. వెంట జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, కొడుపాక సర్పంచ్ కాశినాథ్ రావు, ఎంకేపల్లి మాజీ సర్పంచ్ బద్రి మల్లేశం, కొడుపాక, ఎంకేపల్లి, నాగ్సాన్‌పల్లి, గాజులగూడెం,చిత్రియల్ గ్రామాల రైతులున్నారు.
హెచ్ఆర్సీ సానుకూల స్పందన
హెచ్ఆర్సీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సింగూర్ నుంచి రైతులకు నీరు విడుదలయ్యేలా సంబంధిత అధికారులతో చర్చించి తగిన సిఫారసులు చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టమైన సమాచారం అందిస్తానని కమిషనర్ తెలిపారు.