ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించటంలో జాప్యం వద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు.వేసవి కాలం సమీపిస్తున్నందున విద్యార్థులకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.