ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కోరారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఇంకా ఇంటి పన్ను చెల్లించని వారు వెంటనే చెల్లించాలని సూచించారు. నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలో మొత్తం 11 వేల నివాస గృహాలు ఉండగా, ఇప్పటివరకు 57 శాతం ఇంటి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.7 కోట్ల లక్ష్యానికి గాను రూ.4 కోట్ల వరకు వసూలు చేయగా, ఇంకా రూ.3 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
గతంలో 66 శాతం వసూళ్లు సాధించినట్లు పేర్కొంటూ, ఈసారి కూడా అంతకుమించిన లక్ష్యాన్ని చేరుకునేలా ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని 24 వార్డుల్లో చెత్త సేకరణ, డ్రైనేజీ సమస్యలు సహా ఏ సమస్యలైనా ఉంటే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని తెలిపారు.
మార్చి 31లోగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, కమిషనర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.