- ఈ నెల 30 తుది గడువులోగా ఫీజులో 25 శాతం రాయితీ వర్తిస్తుంది.
- మరోసారి గడువు పొడిగింపు ఉండకపోవచ్చు.
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచన.
ఉమ్మడి రంగారెడ్డి,ముద్ర ప్రతినిధి: ఎల్ఆర్ఎస్ తో ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని చేజార్చుకోవద్దని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణకు ఇంతకంటే అవకాశం మరొకటి ఉండదని, ఈ నెల 30లోగా చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎల్ఆర్ఎస్ కు సమర్పించిన ఎల్1, ఎల్2, ఎల్3 దరఖాస్తు లపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అనధికార లేఔట్ల క్రమబద్దీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.జిల్లాలోని అర్హులైన వారందరూ నిర్ణీత గడువు లోగా ఎల్ ఆర్ ఎస్ ను సద్వినియోగం చేసుకువిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ నాటికి ఎల్ ఆర్ ఎస్ రాయితీ గడువు ముగుస్తున్నందున త్వరపడాలన్నారు. గడువు పొడిగించే అవకాశం లేకపోవచ్చునని చెప్పారు. మళ్లీ ఇటువంటి అవకాశాలు రావని, భూ యజమానుదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మరోసారి గుర్తు చేశారు.ఎల్.ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందన్నారు.ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 30వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు.రుసుము చెల్లించిన వారి దరఖాస్తును అధికారులు పరిశీలించి సత్వరమే అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ప్లాట్లను, అనధికార లే ఔట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారని అన్నారు.అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలియజేసారు.ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్.ఆర్.ఎస్.రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు.క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు.అందుచేత అర్హులైన వారందరు ఏప్రిల్ 30వ తేదీ లోపు క్రమబద్దీకరణ చేసుకోవాలని, ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఇప్పటికే ఈ గడువు మార్చి 31తో ముగియగా, ప్రభుత్వం ఏప్రిల్ 30వ తేదీ అనగా ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిందని అన్నారు. రాయితీ వర్తింపునకు ఇదే చివరి అవకాశం అని కలెక్టర్ స్పష్టం చేశారు.