Take a fresh look at your lifestyle.

డయేరియా పై ఫోకస్ పెట్టండి

  • అంగన్వాడి కేంద్రాలు,స్కూళ్లు, వసతిగృహాలు, కాలేజీల వివరాలు వైద్యశాఖకు ఇవ్వాలి.
  • గతేడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పని చేయండి.
  • సమస్యాత్మక ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
  • అనుబంధ శాఖల అధికారులతో కలిసి క్యాంపులు నిర్వహించాలి.
  • ఆస్పత్రుల్లో మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.
  • హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

ముద్ర, తెలంగాణ బ్యూరో :  గతేడాది హైదరాబాద్ లో ప్రబలిన డయేరియా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య, సంబంధిత శాఖలు అప్రమత్తం కావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు.వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో డయేరియా పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డయేరియా క్యాంపెయిన్ పై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ 2014 నుండి అమలు చేస్తున్న ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్‌నైట్ ను 2024 నుండి “స్టాప్ డయేరియా క్యాంపెయిన్” గా పునర్నామకరణ చేసి..ప్రతి సంవత్సరం జూన్ 16 నుండి జూలై 31 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో “డయేరియా కి రోక్‌థామ్, శుభ్రత, ఓఆర్ఎస్ తో జాగ్రత్తగా ఉండు” అనే నినాదంతో జిల్లా అంతటా అవగాహన కల్పించాలన్నారు.గతంలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జాతీయ ఆరోగ్య విధానంలో ప్రధాన లక్ష్యం ఐదేళ్ల లోపు పిల్లల మృతి శాతం తగ్గించడమేనని అన్నారు. జిల్లాలో డయేరియా కారణంగా జరిగే మరణాలు ఇకపై ఒక్కటి కూడా ఉండకూడదన్నారు.జిల్లా అంతట అనుబంధ శాఖల అధికారులతో వైద్యాధికారులు చేపట్టాలని ఆదేశించారు.డయేరియాతో శరీర ద్రవాలు కోల్పోవడం, నీరసం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి మరణానికి దారి తీసే ప్రమాదం ఉందనీ ఇది పూర్తిగా నివారించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అందించే ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లను అన్ని పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీల్లో అందుబాటులో ఉంచాలన్నారు.సంక్షేమ శాఖల అధికారులు నిర్వహించే క్యాంపెయిన్లో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.జీహెచ్ ఎంసీ ద్వారా పరిశుభ్రత, మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నాణ్యమైన తాగునీటి సరఫరా, ట్యాంకుల శుభ్రత, నీటి పరీక్షలు, డిజిన్‌ఫెక్షన్ లాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, హాస్టల్స్‌లో పరిశుభ్రత, నీటి కాలుష్యం సంబంధించి ఎలాంటి లోపాలు కనిపించకూడదని, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా ఘటనలు చోటు చేసుకోవద్దని తెలిపారు.పరిసరాలు పరిశుభ్రతతో పాటు క్లీన్ డ్రింకింగ్ వాటర్, చేతులు కడుక్కోవడం వంటి శుభ్రత విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పోస్టర్ల ద్వారా ప్రచారం, పాఠశాలల కార్యక్రమాలు, బస్తీలలో, నాళాల పక్కన నివసించే ప్రజల మధ్య స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా జీరో డెత్ కాకుండా జిల్లాలో డయేరియా నిర్ములన లక్ష్యంగా ప్రతిఒక్క శాఖ సమిష్టిగా కలసి పని చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, జిల్లా విద్యా అధికారి రోహిణి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు,వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.