ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూల్ జిల్లా ఇటిక్యాల లో 1951 మే 22న జన్మించారు. ఆయనకు భార్య సావిత్రి, ఇద్దరు కుమారు ఉన్నారు. వైద్య విద్యలో ఎంఎస్ పూర్తి చేశారు. నాలుగుసార్లు నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
1996, 1999, 2004లో మూడుసార్లు టీడీపీ ఎంపీగా, 2009లో కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. 1998లో నాగర్ కర్నూల్ నుంచి టీడీపీ తరపున లోక్ సభ అభ్యర్ధిగా పోటీటేసి ఓటమిపాలయ్యారు. అలాగే 2014లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 ఎంపీ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ సీటు దక్కలేదు. అనంతరం 2022లో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథంను టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. 2023లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)ను విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో మందా జగన్నాథం చేరారు. అయితే 2024లో నాగర్ కర్నూల్ సీటి ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, బహుజన్ సమాజ్ పార్టీలో ఆయన చేరారు.