- ఈటల రాజేందర్ ను ఆదేశించాం.
- రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి బాగోతాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హజరై చెప్పాలని తమ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ను ఆదేశించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.కాళేశ్వరం విషయంలో ఏం తెలిసినా విచారణ కమిషన్‌కు చెప్పాలని ఎంపీ ఈటలకు సూచించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణను కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్‌తో సన్నిహితంగా మసులుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము జవాబుదారీ కాదని అన్నారు.మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కలిసి బీజేపీ నేతలను ఎన్నిసార్లు తిట్టినా తమకు పోయేదేమీ లేదన్నారు.ఈ రెండు పార్టీలు ఒకేమాట మీద ఉంటూ బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.కేసీఆర్ కుటుంబంలో కలహాలు వాళ్ళకు వాళ్ళే తేల్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.ఎవరు ఎక్కువ దోచుకున్నారు, దోచుకున్నది పంచుకోవడం అనే విషయంలో కల్వకుంట్ల కుటుంబంలో ఘర్షణ మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని, ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం బీజేపీకి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.