బండి సంజయ్ 24గంటల్లో రాజీనామా చేయాలి.. లేదంటే కేంద్రం బర్తరఫ్ చేయాలి : జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మైనర్ బాలిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా గంటల తరబడి పోలీసులు స్పందించకపోవడం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. ఇదే ఘటన సామాన్యుల విషయంలో జరిగి ఉంటే పోలీసులు వెంటనే పోక్సో కేసు నమోదు చేసి హడావుడి సృష్టించేవారని విమర్శించారు.
బాధిత బాలికతో సిట్టింగ్ జడ్జి సమక్షంలో వెంటనే వాంగ్మూలం నమోదు చేయాలని, ఆ తర్వాత ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత బండి సంజయ్‌దేనని హెచ్చరించారు. మంత్రి పదవిలో కొనసాగుతూ తన ప్రభావాన్ని ఉపయోగించి బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకురావచ్చని ఆరోపించారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మహిళలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు.
రాజ్యాంగం పదవుల్లో ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం చెబుతుందా అని ప్రశ్నించారు. బండి సాయి భగీరథ గత వ్యవహారాలపై కూడా ఆరోపణలు వస్తున్నాయని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ, మాజీ జెడ్పీటీసీ సుబ్బుర్ బీరు మల్లయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బి ఆర్ ఎస్ నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు ర్యాకల శ్రీనివాస్,కౌన్సిలర్ రాజు మాజీ కౌన్సిలర్లు,కంచి మల్లయ్య మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ జక్కా రాఘవేందర్ రెడ్డి, డైరీ డైరెక్టర్ పండు, రమేష్,బురాన్, ఇస్మాయిల్, సూరజ్, అజయ్,మహిళలు పాల్గొన్నారు.