Take a fresh look at your lifestyle.

ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, ముద్ర:

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపు మాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఆయన బోథ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా ఆయన మహిళా పోలీసు సిబ్బంది నిత్యావసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల ప్రస్తుత స్థితిగతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలని తెలిపారు. మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలను చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విపిఓ విధానాన్ని అమలు చేస్తూ గ్రామస్థాయిలో జరిగే ప్రతి అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో సిసిటీవీ కెమెరాల ఏర్పాటు దిశగా కృషి చేయాలని తెలిపారు. గ్రామాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మండల పరిధిలో గంజాయి లేకుండా గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని అదేవిధంగా గుడుంబా లేకుండా, ప్రభుత్వ రాహితీ బియ్యం అక్రమంగా తరలకుండా, పశువుల రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, మండలంలో ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. పెండింగ్ కేసులు పూర్తి చేసి చార్జిషీట్‌లు దాఖలు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పోలీసుల పట్ల నమ్మకం పెంపొందించే విధంగా విదుల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. విధులలో నీతి నిజాయితీని కనబరచాలని, అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సిఐ డి గురుస్వామి,బోథ్ ఎస్ఐ వి పురుషోత్తం, బజార్హత్నూర్ ఎస్సై సంజయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.