ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: నగరంలో కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే పరిష్కారమని రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్.రాజ్ ఠాకూర్ అన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చంద్ర శేఖర్ నగర్ లో చెత్త జమయ్యే ప్రాంతాలను పరి శుభ్రం చేసి ముగ్గులు వేసి పరిసర ప్రాంతాల ప్రజలకు బయట చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని అవగాహన కల్పించారు. హనుమాన్ నగర్ లోనూ ఇంటింటికీ తిరుగుతూ తడి చెత్త ,పొడి చెత్త వేరు చేయడం, చెత్త రీ సైకిలింగ్ పై అవగాహన కల్పించారు. మల్లిఖార్జున్ నగర్ లో పెద్ద కాలువ లో పూడిక తొలగించే పనులు చేపట్టారు.కె సి ఆర్ కాలనీ లో పిచ్చి చెట్లు, తుప్పలు తొలగించారు.వేర్వేరుగా నిర్వహించిన ఆయాకార్యక్రమాల్లో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, డి ఇ.షాభాజ్, ఎ ఇ తేజస్విని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంజీవ్, అధ్యాపకులు మంథని శ్రీనివాస్, మెప్మా సి ఓ ఊర్మిళ, వార్డు అధికారులు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
