Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రత – సామాజిక బాధ్యత: ప్రతి ప్రాణం విలువైందే.. ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి – తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి

 

ముద్ర, ​కరీంనగర్, ఏప్రిల్ 17:

వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య కంటే రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద సవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రాష్ట్రంలో హత్యల వల్ల 800 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7500 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు.


​ఈ సందర్భంగా డీజీపీ ప్రసంగిస్తూ ముఖ్యాంశాలను వివరించారు:
​సామాజిక ఉద్యమంగా రోడ్డు భద్రత: రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్, రవాణా శాఖల బాధ్యత మాత్రమే కాదని, వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ ఇందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారని తెలిపారు. అందుకే మొదటిసారిగా పోలీస్ శాఖ కార్యక్రమాన్ని *’ప్రజాపాలన – ప్రగతి ప్రణాలిక’*లో చేర్చడం జరిగిందన్నారు.

​హెల్మెట్ ప్రాముఖ్యత: జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70% మరణాలు ద్విచక్ర వాహనదారులవే ఉంటున్నాయి. బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా స్ట్రిప్ (Strap) పెట్టుకోవాలని సూచించారు. స్ట్రిప్ లేకపోతే ప్రమాద సమయంలో హెల్మెట్ ఎగిరిపోయి ప్రాణాపాయం సంభవిస్తుందని హెచ్చరించారు.

​అపోహలు వద్దు: హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయనేది కేవలం అపోహ మాత్రమేనని, తనకు జుట్టు ఊడిపోవడానికి హెల్మెట్‌కు సంబంధం లేదని తన వ్యక్తిగత ఉదాహరణతో వివరిస్తూ నవ్వులు పూయించారు. హెల్మెట్ ధరించడం అనేది ప్యాంటుకు బెల్టు పెట్టుకున్నంత సహజంగా అలవరచుకోవాలని కోరారు.

​సీట్ బెల్ట్ తప్పనిసరి: ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే అందరూ సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయని, ప్రయాణికులు వాహనం వెలుపల పడకుండా రక్షణ లభిస్తుందని వివరించారు.

​తప్పిదాల నియంత్రణ: మద్యం సేవించి వాహనం నడపడం (Drink and Drive), రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని ఉదాహరణలతో వివరించారు.

​డిఫెన్సివ్ డ్రైవింగ్: వాహనదారులు ఎల్లప్పుడూ పరిసరాలను గమనిస్తూ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ చేయాలని, ముఖ్యంగా స్కూళ్లు, గ్రామాల జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించాలని సూచించారు. పాదాచారులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వారు ఎల్లప్పుడూ వాహనాలు వచ్చే ఎదురు దిశలో (Opposite direction) నడవాలని తెలిపారు.

చివరగా, మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ వచ్చిన తర్వాతే పిల్లలకు వాహనాలు ఇవ్వాలని, విద్యార్థులు కూడా బైకుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని కోరారు. ‘అరైవ్ అలైవ్’ సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాద రహిత తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అరైవ్ – అలైవ్ కి సంబందించిన స్కై బెలూన్ డీజీపీ ఆవిష్కరించారు. అదేవిధంగా పోస్టర్ మరియు అరైవ్ – అలైవ్ పాట సీడీని ఆవిష్కరించారు. హెల్మెట్ పంపిణి చేసారు. కరీంనగర్ పోలీసుల తరుపున ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేసారు.

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా విజయ వంతంగా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రహవీర్ ,రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం , హిట్ అండ్ రన్ కేసుల్లో ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాలు ప్రజల్లో అవగాహనా కల్పించే అవసరముందన్నారు. అందుకుగాను మండల స్థాయిల్లో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ అరైవ్ – అలైవ్ కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి గారి మానసపుత్రిక అన్నారు. గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి , ఫిబ్రవరి, మార్చి నెలలో మూడు దశల్లో విజయవంతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవలం కరీంనగర్ లో ఇప్పటివరకు 600 వరకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అన్ని రకాల వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు , సీపీఆర్ మరియు ఫస్ట్ ఎయిడ్ డ్రిల్ పై శిక్షణ అందించామన్నారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు నివారణ చర్యలు చేపట్టామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు నెలల్లో 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించగలిగామన్నారు. మరింత శ్రమించి ప్రజల్లో చైతన్యం కలిగేలా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అశ్విని, డి ఎం హెచ్ ఓ వెంకటరమణ , ఎం వి ఐ చక్రవర్తి , ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ తో పాటు ఇతర అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.