* క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులను సమర్ధంగా నిర్వహించండి*
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో నిర్వహించే జనగణన విధులను సక్రమంగా అమలు చేయాలని, ప్రక్రియ నిర్వహణతో పాటు సాంకేతికత వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యాప్ ద్వారా జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
సోమవారం జనగణన 2027 ఫేజ్–1 గృహాల జాబితా (HLO) కార్యక్రమంలో భాగంగా సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్లకు హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన డిజిటల్ శిక్షణలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి, జిల్లాల కలెక్టర్లు, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ అధికారులు తో కలిసి హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జనగణన నాణ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపైనే ఆధారపడి ఉంటుందని, వారికి సమర్థవంతమైన శిక్షణ అందించాల్సిన బాధ్యత ఫీల్డ్ ట్రైనర్లపై ఉందన్నారు. శిక్షణా మాడ్యూల్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, జనగణన ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలోని 20 మండలాల ప్రణాళిక గణాంక అధికారులు చార్జ్ క్లర్క్‌లు, అసిస్టెంట్ చార్జ్ క్లర్క్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక సహాయకులుగా తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు, పట్టణాల్లో కాలనీలు, అపార్ట్మెంట్లు, చిన్న వీధులు సహా ప్రతి ఇంటిని కవర్ చేస్తూ, ఇంటిలోని ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏ ఒక్కరినీ మిస్ కాకుండా, డూప్లికేషన్ లేకుండా 100 శాతం కచ్చితత్వంతో జనగణన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మారుమూల గిరిజన తండాలు, ఆవాస ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు అన్ని స్థాయిలలో జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అంతకుముందు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డిజిటల్ విధానం, సాంకేతిక సమస్యలు తదితర అంశాలపై సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, మాస్టర్ ట్రైనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.