ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జీవి శ్యాంప్రసాద్ లాల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 41 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా సమీక్షించి, వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, అలాగే పెండింగ్‌లో ఉన్న అర్జీలను వారంలోపే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్‌లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.