ముద్ర, మహదేవపూర్:
రూ.2 కోట్ల వ్యయంతో సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవనం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే బంజారా జాతికి విద్యా, విజ్ఞాన పరంగా దిశానిర్దేశం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గిరిజన సంక్షేమ అధికారి నాగ సాగర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు దేవన్, కౌన్సిలర్లు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..