- సభ విజయవంతంలో వారిని భాగస్వామ్యం చేయండి.
- ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో మరోసారి దిశానిర్దేశం చేసిన కేసీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఈ నెల 27 న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.సభ విజయవంతం లో వారిని విధిగా భాగస్వామ్యం చేయాలన్నారు.ఈ నేపథ్యంలో దీని కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధిత తగిన సూచనలు చేస్తూ శుక్రవారం కేసీఆర్ తన ఫాంహౌజ్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రజతోత్సవ సభ జరిగే తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు మరింత పరుగులు తీయాలన్నారు. లక్షలా దిగా తరలివచ్చే ఈ సభకు ఏర్పాట్లు సైతం భారీగా ఉండాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సభను చూసి అధికార పార్టీకి వణుకుపుట్టాలన్నారు.రజతోత్సవ సభనే అధికార కాంగ్రెస్ ఓటమికి నాంది పలకాలన్నారు.అందువల్ల పార్టీ నేతలంతా కలిసి కట్టుగా సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కవిత,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళనేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్పీఎససి మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్ పర్సన్ రజినీ సాయిచంద్, నవీనా చారి పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
