- ఉత్పత్తి, వినియోగంలోనూ మన రాష్ట్రమే.
- ఒక్కో వ్యక్తి యావరేజ్‌గా 23.97 కిలోల మాంసం.
- అటు మద్యంలోనూ ఫస్ట్ నిలిచిన తెలంగాణ.
- నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మాంసం వినియోగం, ఉత్పత్తిలో మన రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సందర్భం ఏదైనా దసరా, బక్రీద్, బోనాలు, వనభోజనాలు పండుగ ఏదైనా ముక్క లేనిదే ముద్ద దిగుతలేదు.రాష్ట్రంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అక్కడ నాన్‌వెజ్ మాత్రం తప్పనిసరి.ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మాంసం వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది.దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం మంది ఉంటే రాష్ట్రంలో ఏకంగా 98.73 శాతం మంది ఉన్నారు.దేశంలో తినే మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఆహారంగా తీసుకుంటున్నారని జాతీయ మాంస పరిశోధన సంస్థ (ఎన్‌ఆర్‌సీఎం), నేషనల్ శాంపిల్ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.వాస్తవానికి ఒక్కో వ్యక్తి ఏడాదికి 12 కిలోల మాంసాన్ని తినాలని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సూచిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో తలసరి వినియోగం 2. 900 కిలోల నుంచి 3, 260 కిలోల వరకు ఉంటోంది. తెలంగాణలో మాత్రం సగటున ఏడాదికి 23.97 కిలోల మాంసాన్ని తింటున్నారని సర్వేలో తేలింది. మాంసం తినడంలో తెలంగాణ టాప్‌లో ఉండగా, తర్వాతి స్థానంలో ఏపీ ఉంది.
ఇలా రాష్ట్రం మాంసాహార ఉత్పత్తిలోనే కాకుండా.. తినడంలో కూడా దూసుకు వెళ్తోంది. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా మన దగ్గరే ఉన్నట్లు తాజాగా వెళ్లడైంది. అంతేకాదు ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లెక్కల ప్రకారం ఎక్కువగా మాంసం తింటున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. నేషనల్ శాంపిల్ సర్వే, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం ఇండియాలోనే ఎక్కువ శాతం మాంసం రాష్ట్రంగా తెలంగాణ లేచింది.ఈ సర్వే లెక్కల ప్రకారం.. ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక వ్యక్తి యావరేజ్ గా 23.97 కిలోలు మాంసం తింటున్నాడు. అంటే దాదాపుగా ప్రతి నెల రెండు కిలోల చొప్పున ఒక వ్యక్తి మాంసం తింటున్నాడు అన్నమాట. ఈ రేంజ్ లో ఏ రాష్ట్రంలో కూడా మాంసం తినేవాళ్లు లేరని ఈ లెక్కలు చెబుతున్నాయి.తాజాగా ఈ లెక్కలు రాష్ట్ర ప్రజలను మరోసారి షాక్‌లో పడేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాలలో నెంబర్ వన్ అనుకుంటే ఇప్పుడు మాంసం తినే వారిలో కూడా మొదటి స్థానానికి వచ్చింది.
- అప్పుడు కొంత వెనక..!
ఈ ఏడాది జనవరిలో కూడా మాంసం వినియోగం, ఉత్పత్తిపై నేషనల్ శాంపిల్ సర్వే, మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లెక్కలు విడుదల చేసింది. అప్పటి సర్వే ప్రకారం.. భారత్‌లో మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్న రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో 99.8% మంది ప్రజలు నాన్ వెజ్ తింటున్నారట. తర్వాతి స్థానంలో 99.3 శాతంతో పశ్చిమ బెంగాల్ ఉంది. మూడో స్థానంలో 99.1 శాతంతో కేరళ ఉండగా.. 98.25 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత తమిళనాడు 97.65శాతం ఉండగా, ఒడిశా 97.35, తెలంగాణ 97.3తో 7 స్థానంలో నిలిచింది. ఎనిమిదో స్థానంలో 97 శాతంలో జార్ఖండ్, త్రిపుర 95, గోవా 93.8తో చివరి స్థానంలో ఉంది.కానీ, నాలుగు నెలల్లోనే మన రాష్ట్రం నెంబర్ వన్ స్థాయికి వచ్చింది. ఈ లెక్కన మాంసం వినియోగం ఎంత మేరకు పెరిగిందో అర్థమవుతుంది.
- మటన్‌కు భారీ డిమాండ్.
రాష్ట్రంలో 2012లో గొర్రెలు కోటి 28 లక్షల వరకు ఉండగా… ప్రస్తుతం2.11 కోట్లకు పెరిగినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చేపట్టిన పశుగణనలో వెల్లడైంది. అయినా రోజుకు 6 వేల గొర్రెలు దిగుమతి అవుతూనే ఉన్నాయి. గొర్రెల మాంసానికి గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఏటా మటన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గొర్రె మాంసమే ఎక్కువగా తింటున్నట్లు తేలింది. హైదరాబాద్‌లో దసరా, బక్రీద్ పండుగలకు 30 వేల చొప్పున యాటలు తెగుతయి. యావరేజ్‌గా ఈ రెండు రోజుల్లోనే 400 టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతాయని ఎన్‌ఆర్‌సీఎం గణాంకాలు చెబుతున్నాయి.ఇక, ప్రపంచ వ్యాప్తంగా మాంసం వినియోగంలో ఇండియా వెనకబడింది. 2.9 కిలోల తసరి వినియోగంతో 42వ స్థానంలో ఉంది. 95.43 కిలోల తలసరి వినియోగంతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా.. బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- లాభ నష్టాలు.
నాన్‌వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. రోజూ నాన్‌వెజ్ తినడం తప్పు కాదు కానీ ఎలా తినాలో తెలియకపోతేనే ఆరోగ్యానికి నష్టాలు కలుగుతాయి.మరి మాంసాహారాన్ని ఎలా తినాలి? ఎలా డైట్లో చేర్చుకుంటే మంచిది నాన్ వెజ్ తినడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మీరు కూడా నాన్‌వెజ్ ప్రియులైతే మాంసాహారాన్ని ఇలా డైట్లో చేర్చుకోండి.నాన్‌వెజ్ ఎక్కువగా తింటే శరీరానికి అధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్ అందుతుంది.ఇది కండరాల పెరుగుదలకు, నిర్వహణకు మంచిది. అలాగే మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి.రోగనిరోధక శక్తి పనితీరుకు మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి.ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మంచివి. విటమిన్ బి12 అందుతుంది.ఇది నరాల పనితీరు మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.వీటిలోని కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.కొన్నిసార్లు బ్యాక్టీరియాతో కలుషితమై అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.