Take a fresh look at your lifestyle.

పరీక్షల నిర్వహణకు పకడ్డ్బందీ ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:

జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లతో, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వికారాబాద్ కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సుదీర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరి, అడిషనల్ ఎస్ పి రాము నాయక్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీ.ఎస్ రామకృష్ణారావు సూచించారు. ప్రశ్నపత్రాల రవాణా నుండి పరీక్షా కేంద్రాలకు అవి చేరేవరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్ కొరత లేకుండా, విద్యార్థులకు తగిన కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సీఎస్‌ దృష్టికి తెచ్చారు. ఈ నెల (ఫిబ్రవరి) 25 నుండి మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు మొత్తం 16400 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 13579 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరుకానున్నారని, 144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీస్ ఎస్కార్ట్ మధ్య తీసుకెళ్లాలని సూచించామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచాలని ఆదేశించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని అవగాహన కల్పించామని అన్నారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పరీక్షా కేంద్రాల్లో అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంటర్ విద్యాధికారి శంకర్ నాయక్ , డీఈఓ రేణుకా దేవి,, డీపీఓ జయసుధ, ఆర్టిసి ఆర్.ఎం నమ్రత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.