-పదేండ్లు నేనే సీఎం అని చెప్పుకోవడం తప్పు పార్టీ నేతలను, అధిష్టానాన్ని అవమానించాడు ఆయన గట్టోడయితే మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఎందుకు చేజారింది..?
– సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
ముద్ర, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై అధికార పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రినని.. మరో పదేండ్లు నేనే సీఎం అని రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణకు ఆయన్ను ఎవరు రాజు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే మొనగాడా..? అని నిలదీశారు. పదేళ్లు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకోవడం తప్పు కాదా ? అని ప్రశ్నించారు. ఆదివారం నల్గొండలో ఓ మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి… పదేళ్లు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకోవడం తప్పు కాదా ? అని ప్రశ్నించారు. సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఏండ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులతో పాటు అధిష్టానాన్నీ అవమానించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిజంగా మొనగాడు అయితే… పార్టీలో ఆయన గట్టోడయితే మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఎందుకు చేజారిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బలమైన వ్యక్తి అయితే మల్కాజ్ గిరి ఎంపీ సిట్టింగ్ సీటులో ఎందుకు ఓడిపోయామో వివరణ ఇవ్వాలన్నారు. ఆయన అంత బలవంతుడే అయితే ఆదిలాబాద్,కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేక పోయిందో జవాబు చెప్పాలన్నారు. రేవంత్ పీసీసీగా ఉన్న సమయంలో హుజురాబాద్,మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లు ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పుకుంటున్నట్లు రేవంత్ బలమైన నాయకుడు కాదన్న రాజగోపాల్ రెడ్డి… పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ చెమట చుక్క ఫలితమే అన్నారు. రేవంత్ తన వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు