- ఏళ్ల నుంచి రైతులకు జరుగుతోన్న అన్యాయానికి ముగింపు పలుకుతాం.
- ఉమ్మడి పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రోడ్ మ్యాప్.
- పనులు పూర్తి చేసేందుకే రాష్ట్రంలో ప్రాజెక్టు బాట.
- ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మరో 20 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. తద్వారా ఏళ్ల నుంచి రైతులకు జరుగుతోన్న అన్యాయానికి ముగింపు పలుకుతామని చెప్పారు.పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అవాంతరాలను తొలగించేందుకే ప్రాజెక్టులను సందర్శిస్తున్నట్లు వెల్లడించారు.నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్ నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ 3 ఓపెన్ కెనాల్ పనులతో పాటు ఎంజికేఎల్ఐ మొదటి లిఫ్టులోని పంప్ హౌస్ స్విచ్ యార్డ్ పనులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ ఏదుల వట్టెం కరివేన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నింపడానికి ఆరు నెలల సమయం పెట్టుకొని అందుకు ఏ ఏ పనులు చేయాలో సమీక్షలో చర్చిస్తామన్నారు. అంతకు ముందు ఈ రెండు ప్రాజెక్టుల పనులను ప్రగతిని ప్రొజెక్టర్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంజికేఎల్ఐ, నెట్టంపాడు, బీమా,కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పనులు చాలా అడ్వాన్స్ స్టేజిలో ఉండి కూడా గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో పూర్తికాలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పిన విధంగా ఎంజికేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టులో నిరుపయోగంగా ఉన్న రెండు మోటార్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి వినియోగం లోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు.అన్ని ప్రాజెక్టుల్లో ఎక్కడెక్కడ భూసేకరణ వారండార్ ప్యాకేజీలను లిస్ట్ అవుట్ చేసుకోవడానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయించి విడుదల చేసుకోవాలో తమ ప్రాజెక్టుల పర్యటన దోహదపడుతుందని మంత్రి అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నింపడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరికి ఏ విధంగా ముందుకు పోవాలో ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామని తెలిపారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గం లోని కోడేరు మండలం తీగలపల్లి వద్ద (ఎదుల) రెండో లిఫ్ట్ లో పంపింగ్ స్టేషన్, పంప్ హౌస్ సొరంగం కాల్వల పనులను పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉన్నారు.
