Take a fresh look at your lifestyle.

బీసీలు 55 శాతం … సర్కారుకు సర్వే రిపోర్ట్​

  • రిజర్వేషన్లపై డెడికేటెడ్​ కమిషన్​ నివేదిక తర్వాతే నిర్ణయం
  • ప్రస్తుతం బీసీలకు 29శాతం రిజర్వేషన్లు
  • కులగణన లెక్క తేలాకా 40 శాతానికి పైగా పెంపు..?
  • కొత్త రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు
  • ఫిబ్రవరిలో ప్రక్రియ పూర్తి చేసే చాన్స్
  • వచ్చేనెల 2న కేబినెట్​ సబ్​కమిటీ ముందుకు రిపోర్ట్​
  • ఆ తర్వాత కేబినెట్​లో ఆమోదం
  • అసెంబ్లీలో బిల్లు తర్వాతే రిజర్వేషన్లు ఖరారు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీసీల లెక్కతేలింది. రాష్ట్ర జనాభాలో 55శాతం మంది బీసీలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గతేడాది నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కులవారీగా లెక్క తేల్చిన రాష్ట్ర అధికార గణం ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల రెండో తేదిన కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదిక ఇవ్వనుంది. తర్వాత ఆ నివేదికపై చర్చించేందుకు సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం బీసీ బిల్లును ఆమోదించనుంది. అదే సమయంలో ఆ బిల్లుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు న్యాయనిపుణులతో సంప్రదింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రకియను పూర్తి చేసి స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

ఈ మేరకు‘స్ధానిక’ పోరులో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనలు.. ఇది వరకే నియమించిన డెడికేటెడ్ కమిషన్.. కులగణన నివేదికను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదీలావుంటే రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేలో తేలిన గణాంకాలను విశ్లేషించిన డెడికేటెడ్ కమిషన్.. రాష్ట్రంలో బీసీలు సుమారు 55శాతం ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదీలావుంటే ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలందరికీ కలిపి 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజా కులగణన సర్వేతో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉందని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కుల గణన నివేదిక ఆధారంగానే

డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 16 లక్షల 14 వేల 349 నివాసాల్లో సర్వే చేశారు. నవంబరు 9 నుంచి సుమారు 87వేల మంది 76 ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల సంబ అధ్యయనం చేశారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం, భూములు, ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తులు, పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు.

సుప్రీంకోర్టు గైడ్​ లైన్స్​ ప్రకారం..!

స్ధానిక సంస్థల్లో బిసిల రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే జిల్లా పర్యటనలు, బహిరంగ వినతులు స్వీకరించి నివేదికను ప్రాథమికంగా సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తి కాగానే కమిషన్‌కు డేటా అందిస్తారు. దాని ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత కేబినెట్ ఆ నివేదికపై చర్చించి ఆమోదించి రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందించనున్నారు.ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. వాస్తవంగా రిజర్వేషన్ ప్రకారం బిసిలకు 22 శాతం పార్టీ సీట్లు కేటాయించాలని దీంతో పాటు జనరల్ స్థానాల నుంచి మరో 20 శాతం సీట్లు పార్టీ పరంగా బిసిలకు సీట్లు పార్టీలోనూ చర్చ జరుపుతున్నట్టుగా తెలిసింది. దీంతో బిసిలకు తామే అధిక సీట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రజల్లో చెప్పుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

తెలంగాణలో బీసీ కులాలివే.!

తెలంగాణలో బీసీలో అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలను ఏ,బీ,సీ,డీ,ఈ గ్రూపులుగా విభజించారు.గ్రూప్-ఏ లో సంచార తెగలు తదితర కులాలకు చెందిన వాళ్లు ఉన్నారు. గ్రూప్- బి లో వృత్తిపరమైన సమూహాలు,గ్రూప్- సిలో క్రైస్తవమతంలోకి మారిన ఎస్సీలు, గ్రూప్-డిలో ఇతర కులాలు, గ్రూప్​‌‌ ఈ లో సామాజికంగా,విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం కులాలు ఉంటాయి.

గ్రూప్​ బీ కులాలకే పది శాతం రిజర్వేషన్లు

ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలందరికీ కలిపి 29శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.గ్రూప్-ఏకు 7శాతం,గ్రూప్-బికి 10,గ్రూప్-సికి ఒక శాతం,గ్రూప్-డికి 7శాతం,గ్రూప్-ఈ 4శాతంగా రిజర్వేషన్‌లను కేటాయించారు. అయితే ఇటీవల పూర్తయిన కులగణన తర్వాత ఆయా ఆయా కులాల సామాజిక,ఆర్థిక,జనాభా,విద్య,ఉపాధి తదితర అంశాలను ప్రభుత్వం బేరీజు వేయనుంది. తర్వాత ఆయా గ్రూపుల్లో ఉన్న జనాభా ను బట్టి రిజర్వేషన్లను పెంచనుంది. దీంతో పాటు ఆయా కులాల జీవన స్థితిగతుల ఆధారంగా ఒక గ్రూప్‌లో ఉన్న కులాలను ఇంకో గ్రూప్‌లోకి కూడా మార్చే అవకాశంపైనా డెడికెటెడ్​ కమిటీ ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. తర్వాత బీసీ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు చెప్పాయి.

Leave A Reply

Your email address will not be published.