- దేశ,విదేశాల్లోని ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయండి
- పర్యటకులను ఆకర్శించే పాలసీ ఉండాలి
- ఎకో,టెంపుల్ టూరిజంపై ఫోకస్ చేయండి
- పర్యాటక శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :వచ్చే నెల పదో తేదీలోపు నూతన టూరిజం పాలసీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పర్యటక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు దేశ,విదేశాల్లోని ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని సూచించారు. తర్వాత మేధావులు, పర్యాటకరంగ నిపుణులతో చర్చించి కొత్త పాలసీని రూపొందించాలన్నారు. బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పర్యాటక శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా ప్రవేశపెట్టనున్న టూరిజం పాలసీ దేశ,విదేశాల పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలని సూచించారు.
ఇందులో ముఖ్యంగా ఎకో,టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డియార్టుమెంట్స్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలన్న సీఎం.. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా పాలసీని రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమ్మక్క-సారక్క, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్య్యూట్‌గా తీర్చిదిద్దాలని, నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ల్లో కేరళ తరహాలో బోటు హౌస్‌ల ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. సమ్మక్క-సారక్క జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సింగపూర్ వంటి దేశాలు తక్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళికలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కైవాక్, సర్య్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అనంతగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపర్చాలని సూచించారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.