Take a fresh look at your lifestyle.

వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్

  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటన.
  • ఉప్పరపల్లిలో వరద ముప్పును 12 గంటల్లో పరిష్కారం.

ముద్ర, తెలంగాణ బ్యూరో: నగరంలో వరద ముప్పు ఉన్న పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురువారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాలకు వరద ముంచెత్తిన డోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించారు.ఎగువ నుంచి వచ్చిన వరద సాఫీగా గోపి చెరువుకు చేరే మార్గం లేక శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం రోడ్డు, కాలనీని వరద నీరు ముంచేసింది. వర్షం నీరు, గోపి చెరువు నుంచి వచ్చిన వరదతో లింగంపల్లి అండర్ పాస్ లో నీరు నిలిచిందని స్థానికులు వివరించారు. గోపి చెరువు, చాకలి చెరువులో నీటిమట్టం తగ్గించి వరద కట్టడి చేయవచ్చని సూచన చేశారు. అంతకు ముందు వరద ముప్పు ఉన్న కొండాపూర్‌లోని కాసోరోస్ అపార్ట్‌మెంట్ పరిసరాలను తనిఖీ చేసారు.వరద, మురుగు కాలువలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని హామీ అధికారులకు సూచించారు. అనంతరం బాచుపల్లిలో పలు వరద కాలువలను పరిశీలించారు. ఎస్ ఎన్ డిపి చేపట్టిన కాలువల నిర్మాణ పనులు వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు చెన్నం చెరువు నుంచి వచ్చే వరద రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా దిగువన ఉన్న బాచుపల్లి చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

  • 12 గంటల్లో వరద ముప్పునకు పరిష్కారం.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు నగరంలోని రాజేంద్రనగర్ మండలంలోని ఉప్పర పల్లి, శాస్త్రి పురం, పల్లె చెరువు ప్రాంతాలను బుధవారం సందర్శించారు. ఉప్పరపల్లి లోని అశోక్ విహార్ కాలనీలో మురుగు, వరద కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను సందర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదలతో దాదాపు 5 అపార్ట్‌మెంట్ల నివాసితులు 400ల కుటుంబాలు ఏడేళ్లుగా అవస్థలు పడుతున్నామని కమిషనర్ ముందు వాపోయారు. 150 మీటర్ల దూరంలో మూసినదిని కలిపే ప్రధాన కాలువ ఉందని దానికి అనుసంధానంగా కాలువ ఏర్పాటు చేస్తే మా కాలనీ వరద, మురుగు ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిధులు మంజూరయిన అక్కడి భూ యజమానులు పనులకు అనుమతించడం లేదని వాపోయారు. అపార్టుమెంటులో మురుగు నీరు నిలిచి పోతోందని కమిషనర్ కు చూపించారు. కాలువను తవ్వి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ యిచ్చారు. ఈ హామీ మేరకు గురువారం కాలువలను తవ్వించి సమస్యను పరిష్కరించారు.

  • పల్లె చెరువు ఔట్ లెట్ పరిశీలన.

మైలర్దేవుపల్లి లోని పల్లె చెరువు ఔట్ లెట్ ను రంగనాథ్ పరిశీలించారు. గతంలో ఈ చెరువు కట్ట తెగి రోడ్డు మీద వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయి పలువురు మృతి చెందిన విషయాన్ని స్థానికులు కమిషనర్ కు వివరించారు. Outlet ను విస్తరించాలని కోరారు. ఆ దగ్గరలోని శాస్త్రి పురంలో ఎకరన్నర పార్కు కబ్జాను కమిషనర్ పరిశీలించారు. ఈ పార్కుకు సంబంధించిన వివరాలు తీసుకొని ఆక్రమణ దారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు ఆడుకునే స్థలాన్ని తమదని చెప్పి కబ్జా చేశారని స్థానిక మహిళ కమిషనర్ ముందు వాపోయారు. పార్కును పునరుద్ధరించాలని కోరారు. పరిశీలించి లే ఔట్ ప్రకారం పార్కును కాపాడుతామని కమిషనర్ హమీ ఇవ్వడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.