రాష్ట్రానికి నిధులు తెచ్చే సత్తా బీజేపీకే ఉంది
అభివృద్ధి కోసం చిల్లిగవ్వ లేదని సీఎం చెప్పారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు
ముద్ర, హైదరాబాద్ :
ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధికి వెచ్చిస్తోన్న ప్రతి రూపాయి కేంద్రం పంపించిందేనని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీసింది, నన్ను కోసినా ఒక్క రూపాయి లేదు అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన వ్యాఖ్యలను ఈటల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధికి నిధులే లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీని గెలిపించినా ఏం లాభమని ఎద్దేవా చేశారు. గురువారం అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఈటల.. కాంగ్రెస్ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదనీ, పాత పెన్షన్లు పెంచలేదన్నారు. నిరుద్యోగభృతి ఇస్తానన్న మాజీ సీఎం కేసీఆర్… సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. ప్రజల దీవెనలతో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము గెలిచాం తప్ప అభివృద్ధికి ఒక్క రూపాయి తమ చేతిలో లేదంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో ఇద్దరి దోపిడీ పాలన చూశారన్న ఈటల ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్క బీజేపీ మాత్రమే రాష్ట్రానికి నిధులు తీసుకువస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపిస్తే స్మార్ట్ సిటీల పేరుతో డబ్బులు తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ మోడీ తోనే సాధ్యమైందన్నారు.