- ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలి.
- పాఠశాలల్లో అవసరమైన మేర నూతన గదులు నిర్మించాలి.
- పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలి.
- పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలి.
- విద్యా శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు.ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు.పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని ఆదేశించారు. సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలియజేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని తెలిపారు. తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఏ.శ్రీదేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు.