- జులై 1న విచారణకు రావాలని అరవింద్ కు నోటీసులు.
- కేటీఆర్ సమాధానాల ఆధారంగా అరవింద్ విచారణ.
- కేటీఆర్ అరెస్ట్ కు బలపడుతున్న అనుమానాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జులై 1న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నారు.ఈ నెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు రానున్నట్లు తెలిసింది. ఈ కేసులో గత జనవరిలోనే ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారించింది. ఈ క్రమంలో ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ ను ఏసీబీ మరోసారి విచారించింది.ఈ నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడటం ఆసక్తిగా మారింది. ఇదిలాఉంటే.. గతంలో అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ గత వారం కేటీఆర్ ను విచారించింది. బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు ఇలా వివిధ అంశాలపై కేటీఆర్ నుంచి కీలక సమాచారం రాబట్టిన విచారణ అధికారులు ఈసారి కేటీఆర్ చెప్పిన సమాధానాల ఆధారంగా అరవింద్ కు ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తున్నది.అవసరం మేరకు కేటీఆర్, అరవింద్ ను ఉమ్మడిగా విచారించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నది.ఈ క్రమంలో తాజా నోటీసులతో ఈ కేసులో ఏం జరగబోతున్నది అనేది ఆసక్తి రేపుతున్నది. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ వ్యవహారం, ఒప్పందాలు అన్ని తానై కేటీఆర్ వ్యవహరించారని గతంలో అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు.ఈ సారి దర్యాప్తులో ఆయన చెప్పబోయే విషయాల ఆధారంగా కేటీఆర్ అరెస్టు ఉంటుందనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.