- సిట్ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు.
- ప్రణీత్ రావు అండ్ టీమ్ తీరుపై పోలీసు వర్గాలే షాక్
- 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఫోన్లు ట్యాప్
- 618 మంది రాజకీయ నాయకులు
- బాధితుల్లో బీఆర్ఎస్ నాయకులు
- సిట్ జాబితాలో ఐఏఎస్,ఐపీఎస్,పారిశ్రామిక వేత్తలు,జర్నలిస్టులు
- ఇప్పటివరకు 228 మంది వాంగూల్మాల సేకరణ
ముద్ర, తెలంగాణ బ్యూరో : తీగలాగితే డొంక కదిలింది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టింస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు గురి చేసిన ఈ కేసుపై విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నస్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ (ఎస్‌వోటీ) చీఫ్, మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పదులు కాదు.. వందలు కాదు.. అక్షరాల 4,013 మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురయినట్లు నిగ్గు తేల్చింది. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రణీత్ రావు అండ్ టీమ్ 4, 013 మంది పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసిందని ప్రకటించారు. వీరిలో 618 మంది రాజకీయ నాయకులు ఉన్నారని తెలిపారు. మిగిలిన జాబితాలో లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్ట్ లతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారన్నారు. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో విపక్ష పార్టీ నేతల ఫోన్లే కాకుండా… అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ కు గురయినట్లు నిర్ధారించారు. దీంతో ఇప్పటి వరకు ఫోన్లు ట్యాప్ అయిన నేతలు, ఇతర వర్గాలకు చెందిన బాధితులతో బీఆర్ఎస్ నేతల వాంగ్మూలాలు సేకరించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్య, గతంలో అధికార పార్టీలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనం పల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేవీ రత్నంతో పాటు మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా పలువురు సివిల్ సర్వీసెస్ అధికారుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని విచారణ బృందం నిర్ధారించింది. ఇందులో ప్రధానంగా రోనాల్డ్ రాస్, గౌతంలనూ విచారించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదీలావుంటే కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 228 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేశారు.
- త్వరలోనే కేసీఆర్ అరెస్ట్..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం మాజీ సీఎం కేసీఆర్ ను పెద్ద ప్రమాదంలో పడేసిందనే అభిప్రాయాలు అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.. ఆయన్ను స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ చీఫ్‌గా నియమించారు. ఆ తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ (ఎస్‌వోటీ) టీమ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్ రావు చీఫ్‌గా పని చేశారు. వీరిద్దరి నేతృత్వంలో బీఆర్‌ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా పని చేసే సొంత పార్టీ నేతలు సహా కాంగ్రెస్, బీజేపీ, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నేతలు చివరకు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయి. బేగంపేట్‌లోని ఎస్‌ఐబీ ఆఫీస్ కేంద్రంగా ఎస్‌వోటీకి ప్రత్యేక గదులు కేటాయించారు. కేసీఆర్, సీఎంవో, ప్రభాకర్ రావు అందించిన వివరాలతో ప్రణీత్ రావు సుమారు 4,200కి పైగా ఫోన్ నంబర్లతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు.