- నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం.
- 2018 తర్వాత తొలిసారిగా ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి.
- 2047 నాటికి తెలంగాణ లక్ష్యాలను వివరించనున్న సీఎం.
- ఎస్సీ కుల వర్గీకరణ, బీసీలకు 42 శాతంపై ప్రస్తావించనున్న సీఎం రేవంత్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నేడు జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.2018 తర్వాత ఈ సమావేశానికి హాజరవుతున్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం.ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి “తెలంగాణ రైజింగ్ 2047 విజన్” పేరిట ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఇందులో తెలంగాణ 2047 నాటికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న అభివృద్ధి ప్రణాళికలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నుండి కావలసిన సహకారం వంటి అంశాలు పొందుపర్చారు.ప్రధానంగా తెలంగాణ సాధించదల్చుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో పాటు సమగ్రాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తో ముందుకు సాగుతున్న తీరును, 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా వివరిస్తారు. అలాగే ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌లో ముందున్న తెలంగాణ వాటిల్లో మరింత వేగంగా ముందుకు పోయేందుకు చేపడుతున్న చర్యలను సీఎం వివరించనున్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధిలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు , రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న చొరవను గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందు వివరిస్తారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ. 500 కే సిలిండర్ సరఫరా వంటి రాష్ట్రంలో నిరుపేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. అలాగే సామాజిక సాధికారతలో భాగంగా ఎస్సీ కులాల ఉప వర్గీకరణ, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన అంశాలనూ ఈ సమావేశంలో సీఎం ప్రస్తావించనున్నారు.