Take a fresh look at your lifestyle.

కవిత మరో షర్మిల కాబోతుంది

  • రేవంత్ రెడ్డి విడిచిన బాణమే కవిత.
  • కవిత లేఖ తర్వాతే కేటీఆర్, హరీష్ ఇంటికి వెళ్ళారు.
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత మరో షర్మిల కాబోతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. కవిత త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అన్నారు. ఈ డ్రామాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నారని, ఆయన విడిచిన బాణమే కవిత అని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు..  ఏపీలో షర్మిల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు.  కుటుంబంలో అన్న ,చెల్లెలి మధ్య తలెత్తిన మనస్పర్దలు చిలికిచిలికి తుపానుగా మారి, చివరకు పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం, ఆ తరువాత నెమ్మదిగా సమయం చూసి, కాంగ్రెస్ విలీనం చేయడం, కాంగ్రెస్ ఏపి పగ్గాలు తీసుకుని అన్నను టార్గెట్ చేస్తూ షర్మిల  ముందుకు సాగుతున్నారని అన్నారు ఇలా షర్మిల విషయంలో ఏదైతే ఏపీలో జరిగిందో, అదే తెలంగాణా బిఆర్ ఎస్ లో జరగబోతోందని  ఎంపీ రఘనందన్ అన్నారు. ఇటీవల బీఆర్ ఎస్ పార్టీ వరంగల్‌లో ఫ్లీనరీ నిర్వహించిన రోజు తన రాజకీయ వారసుడు కేటీఆర్ అంటూ కేసీఆర్  చెప్పకనే చెప్పేయడం కవితకు ఆగ్రహాన్ని తెప్పించిందని, ఆ రోజు నుంచి కవిత కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని రఘనందన్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి చెప్పడం వల్లనే కవిత లేఖ రాశారని, కర్త , కర్మ, క్రియ రేవంత్ అనే అనుమానాలు ఉన్నాయని రఘనందన్ అన్నారు. లేఖ రాసిన తరువాత ఆగమేఘాలపై కేటీఆర్, హరీష్ రావు ఇంటికి వెళ్లడం, బావబామ్మర్దులు ఇద్దరం ఒక్కటే అనే సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే కవితను ఒంటరిని చేసి బయటకు పంపేందుకు ఫిక్స్ అయ్యారనే వాదనలకు బలపడుతున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీని లాగడం వెనుక రేవంత్ హస్తం ఉందన్నారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక బీఆర్ ఎస్ తో దోస్తే కడుతున్నామనే పుకార్లు పుట్టించేందుకు కవితను వాడుకున్నారనే అభిప్రాయం రఘునందన్ వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదన్నారు. త్వరలో కవిత కొత్త పార్టీ పెట్డం ఖాయమని, ఆ తరువాత కొన్నాళ్లు పార్టీ నడిపించి, వచ్చే ఎన్నికల ముందు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయబోతున్నారని రఘనందన్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.