Take a fresh look at your lifestyle.

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

 

తిరుమల : శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ పంచాంగాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ ప‌రాభవ నామ సంవ‌త్స‌రంలో మనందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు సమకూరాలని ఆకాంక్షిస్తున్నాట్లు చెప్పారు. ధర్మప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. పంచాంగాన్ని రచించిన టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి గారికి, పరిష్కరించిన వైఖానసాగమ పండితులు ఆచార్య శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు.

రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవోలు శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం, డా.ఎ.శ‌ర‌త్‌, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.