-మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ముఖ్యం
ముద్ర, నారాయణపేట:
పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్‌లో OMIF (ఆపరేషన్ మెస్సి ఇండియా ఫౌండేషన్) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదగాలని సూచించారు.

మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ముఖ్యమని, ప్రతి మహిళ చదువుకుంటే వారి కుటుంబం మాత్రమే కాకుండా తరతరాల భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లుగా ప్రతి ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగ జోగిని వ్యవస్థ నుండి విముక్తి పొందిన మహిళలు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు లేని అనాధ విద్యార్థులకు స్వయం ఉపాధి పొందడం కోసం సహాయంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 సెంటర్లలో కుట్టు మిషన్ మరియు బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ పొందిన సుమారు 300 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయగా, 30 మంది ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.