Take a fresh look at your lifestyle.

ఇరిగేషన్ అధికార్లపై మంత్రి తుమ్మల ఫైర్

  • భద్రాచలం కరకట్ట నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం.
  • ఏడాదిగా ఏంచేస్తున్నారంటూ ఉన్నతాధికార్లకు ఫోన్.
  • ప్రజలు మరో సారి ముంపుకు గురి కావాలా ? అంటూ అసహనం.
  • శ్రీరామ నవమి తర్వాత భద్రాచలం రావాలని సీఈకి ఆదేశం.
  • రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇరిగేషన్ శాఖ అధికార్ల నిర్లక్ష్యంపై మండి పడ్డారు.భద్రాచలం కరకట్ట నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆయన గోదావరి ముంపు నివారణకు సుభాష్ నగర్లో నిర్మిస్తున్న కరకట్ట పనులను పరిశీలించారు.ఏడాది కాలంగా పనుల్లో పురోగతి కనిపించక పోవడంతో ఆగ్రహం చెందిన తుమ్మల, అక్కడి నుండే ఇరిగేషన్ సీఈకి ఫోన్ చేశారు.సంవత్సర కాలంగా కరకట్ట పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.అందుకు సీఈ, అక్కడ కరకట్ట, జాతీయ రహదారి క్రాస్ కావడం వల్ల సంబంధిత డిజైన్ ను సంబంధిత రహదారి అధికార్లే ఇవ్వాలని, వారు డిజైన్ ఇవ్వక పోవడం వల్లే కరకట్ట నిర్మాణంలో జాప్యం జరిగిందని చెప్పారు.ఈ సమాదానంతో మరింత ఆగ్రహానికి గురైన తుమ్మల, జాతీయ రహదారి అధికార్లు, ఇరిగేషన్ అధికార్లు డిజైన్ ఇవ్వాలంటున్నారు,మీరేమో జాతీయ రహదారి అధికార్లు ఇవ్వాలంటున్నారు, మరి మీ అవసరం లేనప్పుడు, ఇక మీరేందుకని నిలదీశారు.గత ఏడాది వర్షాలు వచ్చినప్పటి నుండి వెంటనే కరకట్ట పనులు పూర్తి చేయాలని మీకు చెబుతూనే వున్నా, కానీ మీరు ఏమాత్రం పట్టించుకో లేదు. మరో సారి భద్రాద్రి వాసులు ముంపుకు గురి కావాలా ? అంటూ మందలించారు.దీనిపై ఇరిగేషన్ మంత్రితోనూ, సంబంధిత శాఖా కార్యదర్శితోనూ మాట్లాడతానని హెచ్చరించారు.శ్రీరామ నవమి వేడుకలు ముగిసిన వెంటనే, భద్రాచలం వచ్చి, కరకట్ట డిజైన్ ఫైనల్ చేయాలని,రానున్న రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ పర్యటనకు జాతీయ రహదారి ఉన్నతాధికార్లు, ఏజన్సీ ప్రతినిధులు హాజరు కాక పోవడంపై కూడా తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.అందర్నీ సమన్వయం చేసుకుంటూ మే 31 నాటికి ఎర్త్ వర్క్స్ పూర్తి చేయాలని, తరచూ సమీక్షలు జరపాలని అక్కడే వున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు సూచించారు.ఈ పర్యటనలో మంత్రి తుమ్మల వెంట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, ఏఎస్పీ క్రాంతి కుమార్ సింగ్, ఇరిగేషన్ ఇయ్యి జానీ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.