Take a fresh look at your lifestyle.

కబ్జాదారుల నుండి శంభుని కుంటను కాపాడాలి… ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరించాలి…. హైడ్రా కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు నరసింహారెడ్డి….

 

ముద్ర, శేరిలింగంపల్లి :

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ లో ఉన్న శంభునికుంటను కబ్జాదారుల నుండి కాపాడి ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరణ చేయాలని సిపిఎం నాయకులు నాయిని నరసింహారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల నుండి చెరువులను కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని అనేక సందర్భాలలో రెవెన్యూ అధికారులకు,మున్సిపల్ అధికారులకు,ఇరిగేషన్ అధికారులకు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కుంట చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ కాలనీ వాసుల సంతకాల సేకరణతో కలెక్టర్ కు అందించడం జరిగిందన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. బీరంగూడ నడిబొడ్డులో ఉన్నటువంటి శంభునికుంట, రెవెన్యూ అధికారుల రికార్డుల ప్రకారం సర్వేనెంబర్ 765లో 22 ఎకరాల 12 గుంటల భూమి ఉందని అన్నారు. రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారుల అండదండలతో పెద్ద ఎత్తున కబ్జాలు జరిగాయని ఆయన ఆరో పించారు .కుంటలోకి నీరు వచ్చే కాలువలను కుంట నుండి బయటికి వెళ్లే కాలువలను పూర్తిగా కబ్జా చేశారని అన్నారు. వర్షాకాలంలో వరదల తీవ్రతకు అనేక కాలనీలు జలమయం అవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా కుంటలో చెత్తాచెదారం,గుర్రపు డెక్క, డ్రైనేజీ నీరు రావడం వల్ల కుంట పూర్తిగా కలుషితమై పోయిందని అన్నారు. కలుషిత నీరు వల్ల దుర్వాసన, దోమలతో చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు విశ్వ జ్వరాలతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. హైడ్రా అధికారులు జోక్యం చేసుకొని కబ్జాదారుల నుండి కుంటను కాపాడి కాలువలను పునర్నిర్మాణం చేసి ప్రజలందరికీ ఉపయోగపడేలా సుందరీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.