Take a fresh look at your lifestyle.

సమయానికి అందని కాంగ్రెస్ బి ఫామ్ లు

ఇద్దరు అభ్యర్థులకు చేజారిన పార్టీ సింబల్
కాంగ్రెస్ లో కలవరం

ముద్ర, వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల అధికారులకు సమయానికి బీఫాంలు అందజేయక పోవడంతో ఆ పార్టీలో తీవ్ర కలవ రాన్ని రేపింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయి ఉపసంహరణల గడువు ముగిసి పార్టీ అభ్యర్థులు బీఫారాలను అధికారులకు నిర్ణీత సమయంలోగా అందజేయాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి బిఫారాలను పొంది అధికారులకు మంగళవారం మధ్యాహ్న మూడు గంటల వరకే అందజేశారు. అందులో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి నేతృత్వంలో రెండు రోజులుగా అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే కార్యక్రమంలో తర్జనభర్జనలు కొనసాగుతూ వచ్చాయి. పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించిన వారికి బీఫాములను స్థానిక కేడిఆర్ నగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాములు ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. దాదాపు 31 మంది అభ్యర్థులు నిర్ణీత సమయంలోనే అధికారులకు బీఫారాలు అందజేశారు.కానీ ఏడో వార్డు, 25 వ వార్డు కు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ నిలిపేందుకు ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులకు కొద్ది నిమిషాల ముందే కార్యాలయంలో బీఫారాలు అందజేయగా వాటిని తీసుకొని మున్సిపల్ ఎన్నికల కార్యాలయానికి వచ్చేలోపే సమయం మించి పోవడంతో అధికారులు గేట్లు వేసేశారు. దీంతో ఆ ఇద్దరు అభ్యర్థులు బీఫాములు అందించకుండానే వెనుతిరిగాల్సిన పరిస్థితి ఎదురైంది . మున్సిపాలిటీలోని ఏడవ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా 25వ వార్డు బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఆయా వార్డుల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై చర్చలు, తర్జనభర్జనుల అనంతరం ఏడో వార్డుకు నక్క రాములు భార్య సుజాతకు, 25 వ వార్డు కార్యకర్త కదిరి రాములకు కేటాయించి బీఫాములు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అందజేశారు. బీఫారాలను తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి వచ్చేలోపే సమయం ముగియడంతో చేసేది లేకుండా పోయింది. మున్సిపాలిటీలో ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉండాల్సి ఉండగా టికెట్లు కేటాయింపులో నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు అభ్యర్థులకు బీఫాములు అందజేయడంలో ఆలస్యం కావడం, అవి అధికారులకు అందకపోవడం తో అధికారంలో ఉన్న పార్టీకి రెండు వార్డుల్లో హస్తం గుర్తుతో ఓట్లు వేసే పరిస్థితి లేకుండా పోవడానికి కారకులు ఎవరనే దానిపై పట్టణంలో చర్చ సాగుతున్నది. కాంగ్రెస్లో ముగ్గురు హేమాహేమీలు తమ అనుభవాన్ని రంగరించి తర్జనభర్జనలు చేసి అభ్యర్థులను ఎంపిక చేసి నప్పటికీ బి ఫారాలను సకాలంలో అధికారులకు చేరవేయడంలో మాత్రం శ్రద్ధ చూపలేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జిల్లా పార్టీ అధ్యక్షులు fశివసేనారెడ్డి మాట్లాడుతూ పార్టీ సింబల్ చేజారిన విషయం వాస్తవమేనని, ఆయా వార్డులలో పార్టీ సింబల్ లేకపోయినా అభ్యర్థులు గెలిచి తీరుతారని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.