“కింగ్ మేకర్ కానున్న టిఆర్ఎస్”
విత్ డ్రా రోజు బరిలో నుంచి తప్పుకున్న 28 మంది అభ్యర్థులు
కొన్ని వార్డులకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయని కాంగ్రెస్
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట మున్సిపల్ పోరులో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ మధ్య హోరా హోరి ప్రచారం కొనసాగుతుంది. మొదట ప్రధాన పోటీ మాత్రం బిజెపి కాంగ్రెస్ మధ్యన ఉంటుందని భావించారు. కానీ జిల్లా కేంద్రంలో తాజాగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన బైక్ ర్యాలీని చూస్తే మునిసిపల్ పోరులో టిఆర్ఎస్ కూడా ప్రధాన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల చివరి రోజు నాటికి మునిసిపల్ పరిధిలో 24 వార్డులకు మొత్తం 202 నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్క్రూటినీ, విత్ డ్రా, రాజకీయ పార్టీల బీఫామ్ అందజేతనాటికి పేట మున్సిపల్ పోరులో చివరకు 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో బిజెపి నుంచి 24, టిఆర్ఎస్ 24, కాంగ్రెస్ 22, ఏఐఎంఐఎం 02, ఇండిపెండెంట్ 21 అభ్యర్థులతో పాటు 03 ఇతర రాజకీయ పార్టీ నుంచి బరిలో నిలిచారు. నారాయణపేట మున్సిపల్ పరిధిలో కొన్ని వార్డులకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ నేటికీ ప్రకటించకపోవడం గమనార్హం.

“కింగ్ మేకర్ కానున్న టిఆర్ఎస్”
నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కింగ్ మేకర్ కానుంది. కాంగ్రెస్, బిజెపిలకు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం సొంతం చేసుకునేందుకు కావలసిన పూర్తిస్థాయి మెజారిటీ ఒక వేళ రాకపోతే టిఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉంటే వారే మున్సిపల్ పీఠంపై జెండా ఎగరవేసే అవకాశం ఉంది. టిఆర్ఎస్ కు కనీసం నాలుగు నుంచి ఆరు వరకు కౌన్సిలర్ స్థానాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్ రాజేందర్ రెడ్డి సైతం జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ సత్తా ఉండాలని కోణంలో వార్డులలో ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా సరిత హరినారాయణ భట్టాడ్ గా ప్రకటించిన విషయం తెలిసినదే. కానీ బిజెపిలో మాత్రం చైర్పర్సన్ అభ్యర్థి ప్రకటనపై పూర్తిస్థాయిలో స్పష్టత కనిపించడం లేదు.
