ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక భగత్ నగర్ లోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల పండుగ చిన్నారుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బోనాల పండుగ తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాలు నిర్వహించడం తెలంగాణ సంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల పోతరాజులు శివసత్తుల వేషధారణలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. భగత్ నగర్ చౌరస్తా నుండి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ వరకు బోనాల పండుగ జాతర పేరిట ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
