– కరీంనగర్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
– పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
ముద్ర, కరీంనగర్: దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్ కుమార్, బాబూ జగ్జీవన్ రామ్‌ను సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడిగా కొనియాడారు. చిన్ననాటి నుంచే కుల వివక్షను ఎదుర్కొని, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. దేశ సేవనే పరమ ధర్మంగా భావించి ఆచరించిన గొప్ప నేతగా జగ్జీవన్ రామ్‌ను గుర్తుచేశారు.
1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల నుంచి 1986 వరకు నిరంతరం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం ఆయన ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. కేంద్రంలో దాదాపు 29 సంవత్సరాలు మంత్రిగా సేవలందించి, దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ వెంట నడిచిన జగ్జీవన్ రామ్, రాజకీయాల్లో అజాతశత్రువుగా నిలిచారని కొనియాడారు.
జగ్జీవన్ రామ్ జీవితం నుంచి మూడు ముఖ్యమైన సందేశాలు తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కష్టాలను జయించి ఎదగడం, బలహీన వర్గాల కోసం నిలబడడం, దేశ సేవను పరమ ధర్మంగా భావించడం ఆయన బోధించిన మార్గాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మేయర్ క్యాంపు కార్యాలయ ప్రారంభం
అనంతరం తీగలగుట్టపల్లిలో మేయర్ కొలగాని శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మేయర్ క్యాంపు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.