Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
విశ్వేశ్వరుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయంలో ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.