- జిల్లా నుండి 40 మంది శిక్షణ పూర్తి.
- మొదట విడత ఎంపికైన గ్రామాల్లో వీరి ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో తక్కువ ఖర్చుతో ఇండ్లు నిర్మించేందుకు గాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యం లో జిల్లాకు 40 మంది నైపుణ్యం కలిగిన మేస్త్రిలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నాక్ బండ్లగూడ ద్వారా శిక్షణ పొందిన 40 మంది మేస్త్రీలకు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ మేస్త్రిలు ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని శిక్షణలో రోజుకు 300/- రూపాయల చొప్పున, డ్రెస్సులు, హెల్మెట్లు కూడా ప్రతి మేస్త్రికి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎంపిక చేయబడిన గ్రామాల్లో శిక్షణ పొందిన మేస్త్రిలు ప్రతి గ్రామంలో నాలుగు నుండి పది ఇండ్ల వరకు వీరే నిర్మిస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ప్రతి నియోజక వర్గంలో 3 వేల 500 ఇండ్లు నిర్మించడం జరుగుతుందని, ఇంకా కొంత మందికి శిక్షణ ఇచ్చి మేస్త్రీల కొరత ఉన్న గ్రామాలకు పంపడం జరుగుతుందని అన్నారు. రెండో విడత శిక్షణలో డిఆర్డిఏ ద్వారా మహిళలకు కూడా మేస్త్రిలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.సి.నాయక్, ఎన్ ఎ సి ఎ డి, తదితరులు పాల్గొన్నారు.