- బ్యాంక్ సిఇఓ వనమాల శ్రీనివాస్
ముద్ర ప్రతినిది,జగిత్యాల: రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 81 బ్రాంచీలతో బ్యాంకింగ్ సేవలను అందించబోతున్నమని.. బ్రాంచీల నెట్వర్క్ లో దక్షిణ భారతదేశంలో కో-ఆపరేటివ్ బ్యాంకులలో అత్యధిక బ్రాంచీల నెట్వర్క్ గాయిత్రి బ్యాంకు మొదటి స్థానంలో నిలిచినట్లు బ్యాంక్ సిఇఓ వనమాల శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాయిత్రి బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో మరో 15 నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. సెప్టెంబర్ 11, 2000న జగిత్యాల కేంద్రంగా ప్రారంభించిన ది గాయత్రి కో ఆపరేటివ్ బ్యాంకు ప్రస్తుతం రూ. 1779. 15 కోట్ల డిపాజిట్లు, రూ. 1339.55 కోట్ల ఋణనిలువ కలిగి రూ.3118.70 కోట్ల వ్యాపారాన్ని సాధించి 7,88,304 మంది ఖతాదారులతో మల్టిస్ట్రేట్ కో ఆపరేటివ్ బ్యాంకుగా, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 62 బ్రాంచీలతో సేవలందిస్తున్నామని తెలిపారు. గత 24 సంవత్సరాలుగా గాయత్రి బ్యాంకు సత్వర, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా, ప్రజల ఆదరాభిమానాలతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరుకోగలిగామన్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో ఇప్పటి వరకు 26 నూతన బ్రాంచీలను ప్రారంభించగ, మరో 6 బ్రాంచీలను కలిగియున్న యాదగిరి లక్ష్మి నరసింహస్వామి బ్యాంకును విలీనం చేసుకోవడంతో మొత్తం 62 బ్రాంచీలకు చేరుకొనిఎప్రిల్, మే మాసంలలో మరో 4 బ్రాంచీలు ప్రారంభించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను భారతీయ రిజర్వ్ బ్యాంకు నూతనంగా మరో 15 బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని వీటిని కొడిమ్యాల, నిజామాబాద్ జిల్లా బోధన్, మోర్తాడ్, హన్మకొండ జిల్లా పరకాల, వరంగల్ జిల్లా నర్సంపేట్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మధిర, వైరా నల్గొండ జిల్లా నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ళలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్లు రామ్ సత్యనారాయణ, జనరల్ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ జనరల్ మేనేజర్ సి.హెచ్. కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.